119. చైతన్యం, కరుణల పొందిక

04/11/2025 3 min Temporada 7 Episodio 119

Listen "119. చైతన్యం, కరుణల పొందిక"

Episode Synopsis

ఈ భూలోకంలో జ్ఞానోదయం పొందిన ప్రతి వ్యక్తి చేసిన బోధనల సారాంశమూ సమానత్వమే. పదములు, భాషలు మరియుపద్ధతులలో తేడా ఉండవచ్చు కానీ సమత్వము సాధించుటమే ప్రతి ఒక్కరి సందేశం యొక్క సారాంశము. దీనికి భిన్నంగా సాగిన ఏ ప్రభోధనమైనా, ఆచరణ అయినా మూఢత్వంతో కూడుకున్నది తప్ప మరోటి కాదు.మనస్సు విషయములో ఒక వైపు ఇంద్రియాలు మరియు మరొక వైపు బుద్ధి మధ్య సమతుల్యత సాధించడం. ఒకరుఇంద్రియాల వైపు మొగ్గితే కోరికల్లో మునిగిపోతాడు. మేధావి అయిన వ్యక్తి తగిన చైతన్యం కలిగి ఉంటాడు కానీ అవసరమైనంత కరుణ లేకపోతే ఇతరులను చిన్న చూపు చూసే ప్రమాదం లేకపోలేదు. ఎవరైతే ఇతరుల సుఖ దుఃఖాలను తమవిగా చూడగలుగుతాడో అతడే నిజమైన యోగి అని శ్రీకృష్ణుడు చెప్తారు (6.32). ఇది చైతన్యం, కరుణలు సమపాళ్లల్లో ఉన్న జీవితం. శ్రీకృష్ణుడు బంగారం, రాతి వంటి వాటిని సమానంగా పరిగణించమని చెప్పారు. ఒక ఆవు, ఒక ఏనుగు మరియు కుక్కను ఒకేలా చూడమని చెప్పారు. తర్వాత మిత్రులు, శత్రువులతోసహా అందరినీ సమభావనతో చూడమని చెప్పారు. ప్రతి వ్యక్తితో వ్యవహరించడానికి మూడు వేర్వేరు స్థాయిలు ఉన్నాయి అని గమనిస్తే ఈ బోధనను అర్ధము చేసుకోవడం సులభం. మొదటిస్థాయి దేశం యొక్క చట్టం ముందు సమానత్వం లాంటిది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు సమానంగా పరిగణించబడే హక్కు ఉంటుంది. మనకు అత్యంత ఆప్తులైన వారు ఆప్తులు కాని వారిగుణగణాలను సమానంగా స్వీకరించగలగటం అవగాహన యొక్క రెండవ స్థాయి. ఇది తల్లిదండ్రులను, అత్తమామలను సమానంగా చూసుకొవడం లాంటిది. ఇతరుల సుఖాలను మన సుఖాలుగాభావించడం, వారి కష్టాలను మన కష్టాలుగా స్పందించడం; మనల్ని ఇతరులతో సమానంగానూ, ఇతరులను మనతో సమానంగానూ చూడగలగటం అనేది సమత్వంలో అత్యున్నత స్థాయి. ఇది చరాచర జీవులను సమానంగా చూడగలిగేసామర్ధ్యం ఉన్నప్పుడు కలిగే కరుణ హృదయ తత్వమే. దీన్నే శ్రీకృష్ణుడు అలౌకిక ఆనందం అని అంటారు. మనస్సు ఈ ప్రశాంత స్థితికి చేరుకున్నప్పుడు రాగద్వేషాలు అదుపులో ఉంటాయి (6.27).  ఈ ప్రశాంత చిత్తాన్ని సాధించడానికి ప్రతి నిత్యమూ కృతనిశ్చయంతో ప్రయత్నించాలని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు (6.23). స్థిరత్వం లేని మనస్సు చంచలత్వంతోవ్యవహరించినా దాన్ని అదుపులోకి తీసుకురావల్సిన అవసరం ఉంది (6.26). ఈ రకమైన ఆధ్యాత్మిక అభ్యాసాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ వెళ్తే అంతులేని అలౌకికానందాన్నిపొందవచ్చని  శ్రీకృష్ణుడు చెప్తున్నారు (6.28).